Pages

Tuesday, 7 May 2013

యోగినివి నీవే... ఇంద్రాణీ సప్తశతి 18

మూడవదైన అనుష్ట్భుం శతకములోని-రెండవ మాణవక స్తబకంలోని శ్లోకాలను చూద్దాం.
1. శక్తతమా శక్రవధూ హాసవిభా మే హరతు
మానస మజస్రం జేతు మశక్యం తిమిరం॥
ఇంద్రాణీదేవి చిరునవ్వు వెదజల్లే కాంతి అత్యంత సామర్థ్యం గలది. ఆ కాంతి నా మనస్సు నడిచే దారిని ఆవరించి జయించడానికి దుర్లభంగా మారిన అజ్ఞానాంధకారాన్ని హరించుగాక!

2. భారత భూ పద్మదృశో దుర్దశయా క్షీణతనోః
బాష్ప మజ్రసం విగళ ద్వాసవ భామా హరతు॥
తన దుర్దశవల్ల బలహీనమైన శరీరాన్ని కలిగిన ఈ భారతభూమి అనే కాంత కళ్లలోనించి ఏకధారగా కారుతున్న కన్నీటిని ఇంద్రాణి హరించుగాక!
3. దండిత రక్షో జనతా పండిత గీతా వనితా
మండిత మాహేంద్ర గృహా ఖండిత పాపా జయతి॥
4. సద్గుణ సమ్పత్కలితం సర్వశరీరే లలితం
దేవపతేః పుణ్యఫలం పుష్యతు మే బుద్ధిబలం॥
రాక్షస సమూహాన్ని దండించే శక్తిగలది, పండితులంతా కీర్తించేదీ, ఇంద్రుడి భవనానికే అలంకారమైనదీ, పాపాలను ఖండించేదీ అయిన వనిత ఇంద్రాణీదేవి ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె సద్గుణ సంపద కలిగి, అత్యంత సుందరమైనదే కాదు. ఇంద్రుని పుణ్యఫలం కూడా ఆమెయే. అటువంటి ఇంద్రాణీదేవి నా బుద్ధిబలాన్ని వృద్ధి చేయుగాక!
5. హాస విశేషైరలసై ర్దిక్షు కిరం త్యచ్ఛ సుధాం
ఇంద్ర దృగానందకరీ చంద్రముఖీ మామవతు॥
6. ప్రేమతరంగ ప్రతిమై శ్శీతల దృష్టి ప్రకరైః॥
శక్రమనో మోహకరీ వక్రకచా మామవతు॥
7. గాఢరసై శ్చారుపదై ర్గ్ఢూతరార్థై ర్వచనైః
కామకరీ వృత్రజితో హేమతను ర్మామవతు॥
8. మృత్యుతనుః కాలతనో ర్విశ్వపతేః పార్శ్వచరీ
ప్రేత జగద్రక్షతి యా సా తరుణీ మామవతు॥
మందహాస విశేషంవల్ల అన్ని దిక్కులలోనూ నిర్మలమైన కాంతులను (సుధలను) వెదజల్లుతూ, ఇంద్రుడి కళ్లకు ఆనందాన్నిస్తుంది ఆ చంద్రముఖి. ప్రేమ తరంగాలతో సమానమైన చల్లని ఆమె దృష్టిచే ఇంద్రుడి మనస్సును రంజింపజేసే ఆ దేవి, వంపులు తిరిగి ఉన్న కొప్పులతో ఉంది. గాఢ రసం, మనోహరమైన పదాలు, నిగూఢమైన అర్థాలూ ఉన్న మాటలతో దేవేంద్రుడికి కామాన్ని కలిగిస్తుంది ఆ హేమ తనూదేవి (ఇంద్రాణీదేవి). కాలమే శరీరంగా కలిగి ఇంద్రుడిలో సగభాగంగా ఉండేదీ ఆమెనే. మృత్యు రూపిణిగా ఆ దేవి ప్రేత లోకాన్ని కూడా రక్షిస్తూ ఉంది. అటువంటి ఇంద్రాణీదేవి నన్ను రక్షించుగాక!
9. ప్రేత జగత్కేచి దధో లోక మపుణ్యం బ్రువతే
శీత రుచేర్నాన్యదిదం తత్త్వవిదన్యో వదతి॥
10. భూరియ ముర్వీవసుధా వారిజవై ర్యేష భువః
స్వర్మహసాం రాశి రసౌ యేషు నరప్రేత సురాః॥
11. రాజత శైలం శశినః కేచిదభిన్నం బ్రువతే
మృత్యు యమా వేవ శివా వీశ్వరి తేషాంతు మతే॥
12. రాజతశైలఃపితృభూ రోషధిరాడేష యది
కాంచనశైల స్సురభూ ర్బంధురసౌ వారిరుహాం॥
అమ్మా! ఈశ్వరీ! కొందరు ప్రేత లోకాన్ని పాపభూయిష్ఠమైన అధోలోకం అంటారు. మరొక తత్త్వవేత్త అది చంద్రుడే కానీ వేరు కాదు అంటున్నాడు. ఈ భూలోకాన్ని ఉర్వి, వసుధ అనీ, భువర్లోకాన్ని పద్మాలకు శత్రువైన చంద్రుడనీ, తేజోరాశియైన సూర్యుని సువర్లోకమనీ అంటారు. అంతేకాదు. భూలోకంలో మానవులు (నరులు),్భవర్లోకంలో ప్రేతలు, సువర్లోకంలో దేవతలు (సురలు) నివసిస్తారని అంటారు. అదే కొందరు కైలాసమూ చంద్రుడూ వేర్వేరు కాదని అంటారు. వారి మతంలో పార్వతి మృత్యురూపిణి. శివుడు కాలరూపుడు (యముడు). కైలాసం అనేది పితృభూమి (శ్మశానం) అనీ, అదే చంద్రుడనీ అంటారు కూడా. మేరువుదేవతల భూమి అనీ, అది సూర్యుడే గానీ వేరొకటి కాదనీ వారంటారు.
13.పావయ భూమిం దధతః పావక కాయస్య విభోః
భామిని భావానుగుణే సేవక మగ్నాయి తవ॥
భూమిని ధరిస్తూ అగ్నినే శరీరంగా కలిగిన విభుని భావాలకు అనుగుణంగా ఉండే ఓ స్వాహాదేవీ! నీ సేవకువడైన నన్ను పవిత్రుని చెయ్యి (ఇక్కడ అగ్నాయి అంటే అగ్నిదేవుడి భార్య).
14. యస్య యమో భూతపతి ర్బుద్ధి మతస్తస్య మతేః
అగ్నిరుపేంద్రో మఘవా కాంచన గర్భో భగవాన్‌॥
15. యస్య మహాకాలవధూ ర్మృత్యురపి ద్వే న విదః॥
త్వం శచిమేధా స్యమతే పావకశక్తిః కమలా॥
అమ్మా! శచీదేవీ! ఎవరి మతంలో భూతపతియైన ఈశ్వరుడు యముడో, ఆ బుద్ధిమంతుని మతంలో అగ్నియే విష్ణువు. హిరణ్య గర్భుడు ఇంద్రుడు. ఎవరి మతంలో మహాకాలుడి భార్య మృత్యువైనా ఆమెకు రెండు రూపాల్లేవో, వారి మతంలో నీవుతెలివిగానూ, అగ్నిశక్తిగానూ, లక్ష్మిగానూ ఉన్నావు.
16. నామసు భేదోస్తు ధియా మీశ్వరి నిష్కృష్టమిదం
సూర్య ధ రేందు ష్వజరీత్వం త్రితను ర్భాసిపరే॥
17. సాత్త్విక శక్తి స్సవిత ర్యాదిమరామే భవసి
రాజస శక్తిర్భుపి న స్తామస శక్తి శ్శశిని॥
18. సర్వగుణా సర్వవిభా సర్వబలా సర్వరసా
సర్వమిదం వ్యాప్యజగ త్కాపి విభాంతీ పరమా॥
ఓ తల్లీ! నీ పేర్లలో బేధాలుండవచ్చు. సూర్యుడు, భూమి, చంద్రులలో నీవు మూడు శరీరాలతో ప్రకాశిస్తున్నావన్నది మాత్రం నిశ్చయం. ఇంకో సంగతేమిటంటే, నీవు సూర్యునిలో సాత్వికశక్తిగా, భూమిపై రాజసశక్తిగా, చంద్రుడిలో తామస శక్తిగా ఉన్నావు. అన్ని గుణాలూ, అన్ని తేజస్సులూ, అన్ని బలాలూ కలిగి ఈ జగత్తులో వ్యాపించి ప్రకాశించే ఒక్కగానొక్క ఉత్కృష్టమైన దానివి నీవు.
19.వ్యోమతను ర్నిర్వపుషో దేవి సతస్త్వం దయితా
అస్యభియుకె్తైర్విబుధై రంబ మహేశ్వర్యుదితా॥
20. సా ఖలు మాయా పరమా కారణమీశం వదతాం
సా ప్రకృతి స్సాంఖ్యవిదాం సా యమినాం కుండలినీ॥
అమ్మా! ఆకాశ శరీరిణివి నీవు. కానీ శరీరంలేని సద్ వస్తువుకు భార్యవైనావు. యుక్తిగల పండితులు నిన్ను మహేశ్వరి అంటున్నారు. అన్నిటికీ ఈశ్వరుడే కారణమని చెప్పేవారికి ఆ మహేశ్వరియే పరమమైన మాయ అవుతోంది. సాంఖ్య వాదులకు ఆమె ప్రకృతిగానూ, యోగసాధకులకు ఆమే కుండలినీగా ఉంది.

  • కావ్యకంఠ శ్రీ వాశిష్ట గణపతిముని విరచిత
     సెల్. 9441234429 
  • 23/12/2012
    ఆధారం : 
http://archive.andhrabhoomi.net/content/y-170

No comments:

Post a Comment