''స్త్రీల స్వాతంత్య్రాన్ని హరించటం, వర్ణ భేదాలు, పంచముల దైన్యస్థితి, వేదాల అర్థాన్ని సక్రమంగా తెలుసుకోకపోవడం నేటి ప్రధాన సమస్యలు. వీటిని పరిష్కరించటం ద్వారా భారతదేశాన్ని తిరిగి వైభవ స్థితికి తీసుకువెళ్ళగలం'', అంటూ 'ఇంద్రాణి సప్తశతి'లో ప్రముఖ పండితులు కావ్యకంఠ వసిష్ఠ గణపతి ముని పేర్కొన్నారు.
శ్రీ గణపతిముని బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆధ్యాత్మిక రంగంలో ఆయన గొప్పయోగి, సిద్ధపురుషుడు, ధార్మిక రంగంలో వేదకాలపు ఋషులకు దీటైనవాడు. విద్యారంగంలో, కవిత్వ పాండిత్యాల్లో సమ కాలీనుల్లో సాటిలేని మేటి, ఏకసంథ్రాగ్రాహి, సామాజిక రంగంలో విప్లవకరమైన మార్పులకు దోహద పడిన వాడు. వీరిని సాక్షాత్తు గణపతి అంశగా సాధకులు భావిస్తారు.
విజయనగరం జిల్లా బొబ్బిలికి సమీపంలోని కలువరాయి గ్రామంలో 17 నవంబర్ 1878న సూర్య గణపతి శాస్త్రిగా జన్మించాడు. సూర్యగణపతి శాస్త్రి తండ్రి అయ్యలసోమయాజుల నరసింహశాస్త్రి యువకుడుగా దేశపర్యటన చేస్తూ 1857 స్వాతంత్య్ర ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో పాల్గొన్న వీరులను, వారిని సమర్థించిన ప్రజలను బ్రిటిష్ వారు క్రూరంగా అణిచివేయడాన్ని కళ్ళారా చూశారు. ''ఈ ఆంగ్లే యుల బానిసత్వం నుండి భారతమాతకు విముక్తి చేయగల కుమారుడు తనకు కలగాలని'' ఆయన భగవంతుణ్ణి ప్రార్థించాడు. 19 ఏండ్లు వచ్చేసరికి గణపతి శాస్త్రి వ్యాకరణాలంకార సాహిత్య, శాస్త్రాల్లో, పురాణతిహాసాల్లో పండితుడయ్యాడు. సాధన చేస్తూ 1896 నుండి 1902 వరకు దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాలు సందర్శించాడు. 1902లో అరుణాచలం చేరి శ్రీ రమణమహర్షి శిష్యుడయ్యాడు.
1903లో చెన్నపట్టణం చేరి కొందరు విద్యార్థులకు, యువకులను సమీకరించి, ''కర్మయోగం, వేదకాలపు ఋషి జీవితవిధానం, స్త్రీ పురుష వివక్ష వర్ణవివక్ష అంతమొందిచటం, ప్రతిఇల్లు మంత్ర స్పందితం కావడం అనే నాల్గు ఆశయాల ద్వారా దేశానికి కళ్యాణం జరుగుతుం''దని గణపతిశాస్త్రి బోధించారు.
1904లో వేలూరు క్రైస్తవ పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేస్తూ ఎంతోమంది స్త్రీ, పురుషులకు కులవివక్షకు తావులేకుండా అందరికీ మంత్రదీక్ష నిచ్చారు. వేదమత ప్రాముఖ్యాన్ని
తెలియచేస్తూ వారు బహిరంగ సభలలో చేసిన ప్రసంగాలవల్ల హిందువుల్లో మాతాభిమానం పెరిగింది. పరమత ప్రచారానికి అడ్డుకట్ట పడింది. ''వందేమాతరం'' ఉద్యమం తీవ్రంగా నున్న రోజులవి. ''ఇంద్ర సంఘం'' అనే సంస్థను ప్రారంభించి ''ఉమాం వందేమాతరం'' అనే మంత్రాన్ని యువకులకు ఉప దేశించారు.
1922లో అరుణాచలంలో వారు వ్రాసిన ''ఇంద్రాణీ సప్తశతి''లో స్త్రీల స్వాతంత్య్రానికి, పంచముల దైనస్థితి తొలగడానికి, వేదార్థాల సందేహాలు తీర్చడానికి, వర్ణభేదాలు తొలగడానికీ ఇంద్రాణిని ప్రార్థిం చాడు. ఈ పుస్తకంలోని శ్లోకాలు భారతదేశ దుర్గతికి పరితపిస్తూ, దేశ వైభవాన్ని కోరుతూ వ్రాసినవే.
1923 కాకినాడ కాంగ్రెసు మహాసభల్లో సామాజిక అసమానతలను, అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ వారు చేసిన ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. వేదాలను ఉటంకిస్తు, మహిళలు సైతం యజ్ఞోపవీతం ధరించడానికి అర్హులనీ, మంత్రోపదేశానికి అర్హులనీ వాదించాడు. ఆలమూరు కాంగ్రెస్ సభలో అస్పృశ్యతా నివారణకై చేపట్టవలసిన చర్యలను వివరించారు. 1924 ద్రావిడ రాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా బెల్గాం కాంగ్రెస్ సభలో అస్పృశ్యతానివారణను గురించి ప్రసంగించాడు. జాతీయ భాషగా సంస్కృత భాషను ప్రవేశపెట్టాలని వాదించాడు. 1925 బందరు సనాతనధర్మ సభలో దురాచాలను తొలగించుకోవాలంటూ ఉద్భోధించారు. తమిళనాడులో శర్మదేవీ క్షేత్రంలో దళితవర్గానికి చెందిన వ్యక్తిని వంట వానిగా పెట్టించారు.
సామాజిక అసమానతలను తొలగించడంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ, పనిచేసారు. వారు నిమ్నవర్గాల ప్రజల ఉన్నతి కోసం చేసిన కృషికి గౌరవసూచకంగా 25 ఫిబ్రవరి, 1927న హైదరాబాద్‌లో శ్రీ మాడపాటి హనుమంతరావు గారి ఇంటి నుండి చాదర్‌ఘాట్ వద్దగల ఆదిహిందూ భవనం వరకు దళితులు వారి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆదిహిందూభవన్‌లో జరిగిన సన్మాన సభలో ప్రముఖ దళిత నాయకుడు శ్రీ భాగ్యరెడ్డివర్మ, వామనరావు, రామచంద్రరావు నాయక్, పండిత కేశవరావు (ఆర్య సమాజం) వంటి పురప్రముఖులు కావ్యకంఠ గణపతిముని పేద, దళిత ప్రజలకు చేసిన సేవలను కొని యాడారు. వారికి 'ముని' బిరుదునిచ్చారు. శ్రీరమణ మహర్షికి నాయన వ్రాసిన ఉత్తరంలో తమ భకి స్థానాలు 1. భగవాన్ రమణులు 2. భగవాన్ ఇంద్రుడు 3. భారతమాతలుగా పేర్కొన్నారు.
వారు 25 జూన్ 1936లో సమాధి పొందారు.
No comments:
Post a Comment