Pages

Tuesday 7 May 2013

సర్వులకు అభయంకరి ..ఇంద్రాణి

భారత జాతి సముద్ధరణకు శ్రీ కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని నిత్యమూ లోలోపలే పరితపించేవారు. మన దేశం, మన జాతి సర్వారిష్టాలనుండి ముక్తి పొందాలనీ, పొందుతుందనీ చెప్పారు. దానికోసం ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి తన తప్ఫఃలాన్ని ధారపోయడానికి ఆయన సిద్ధపడిన రీతి పలువురిని ఆకర్షించింది. ఎందరికో ఆయన మంత్ర దీక్షనిచ్చారు. కొందరు శిష్యుల ప్రార్థన మేరకు ‘‘ఉమాం వందేమాతరం’’ అనే మంత్రాన్ని ఉపదేశించారు.

1922లో తిరువణ్ణామలైకి వచ్చి ఉమాసహస్రాన్ని ఏడవసారి విజయవంతంగా సంస్కరించే సమయంలో ఒకరోజు నాయన దీక్షపూని ఉండగా ఆయనకొక వింత అనుభవం ఎదురైంది. నిర్మలమైన ఆకాశంలో ఒక మెరుపు తళుక్కున మెరిసింది. దాని వెంట ఒక దివ్య శబ్దం వినవచ్చింది. అవి ‘‘ఇంద్రాణీదేవి’’ సంబంధించినవని నాయనకు స్ఫురించి, ఇన్నాళ్లూ ఆమె ‘శక్తి’ని స్తుతించలేదే అని పొరబాటును గుర్తించారు. ఎందుకంటే, లోగడ పడైవీడులో, మహేంద్రగిరిలో, విరూపాక్ష గుహలో చూపిన కటాక్షానుహ్రాలకు ఇంతకాలంగా ఉమాదేవిని స్తుతించినట్లు ఇంద్రాణీదేవిని స్తుతించలేదు.
ఆ విషయాన్ని గుర్తించిన వాసిష్ఠముని వెంటనే ఇంద్రాణీదేవిని స్మరించి ఇలా ప్రతిజ్ఞ చేశారు. ‘‘ఏ మహాశక్తి అయితే నా మీదా, విశాలాక్షిమీదా, మావలె గిరి రూపంలో ఉన్న శివభక్తుల మీదా మూర్ఖపళని సాధువు కల్పించిన అపవాదును పిడుగు రూపంలో తుడిచి వేసిందో, ఏ మహాశక్తి ఉమా సహస్రాన్ని శత్రువులనుంచి రక్షించి స్వయంగా స్వీకరించి ప్రీతి చూపిందో, పడైవీడులో ఏ మహాశక్తి రేణుకాదేవి రూపాన్ని ధరించి తన విచిత్ర దర్శనంతో తనను అనుగ్రహించి వజ్రాస్త్ర మంత్రాన్ని బుద్ధికి ప్రదర్శించిందో, అటువంటి అనుగ్రహ దేవతాశక్తియైన ఇంద్రాణిని స్తుతించడానికి 700 శ్లోకాలతో కూడిన ఒక గ్రంథాన్ని వ్రాసెదను గాక. దీని కొరకు 20 రోజులు దీక్ష పూనెదనుగాక. ఇది గ్రీష్మఋతువే అయినా నిర్మలాకాశంలో దివ్య తేజస్సునెలా చూపిందో, నా రచనకు ఆమె ప్రీతిచెందితే, అదే రీతిన రోజూ మెరుపును చూపించుగాక. ఏ రోజున నా రచన ముగిసినపుడు మెరుపు కనిపించదో, ఆ రోజు వ్రాసిన భాగాన్ని చించివేసి, చివరకు దీక్షా కాలానికి గ్రంథం పూర్తికాకుంటే మొత్తం గ్రంథానే్న చించివేయుదునుగాక.’’
అలా ప్రతిజ్ఞ చేసిన నాయన ఇంద్రాణీ సప్తశతి రచనకు సంకల్పించి రమణ మహర్షికి ఆ విషయాన్ని తెలిపి, మహర్షి ఆశీర్వాదాన్ని పొందారు.
ఈ గ్రంథంలో కూడా ఉమాసహస్రంలో లాగానే ప్రతి 25 శ్లోకాలనూ ఒక స్తబకంగా, 4 స్తబకాలను ఒక శతకంగా రూపొందించారు. స్తబకం అంటే గుత్తి, శ్లోకాల మాల. ఒక్కో స్తబకం ఒక్కో వృత్తంలో ఉండేలా చిత్ర విచిత్రమైన గమకాలను ఊహించి వైదిక ఛందోబద్ధంగా వ్రాశారు. ప్రతి స్తబకంలోనూ తొలి శ్లోకంలో ఇంద్రాణీదేవి మందహాసాన్ని స్తుతిస్తూ, ఈ భూమి మీద ఆ ధరహాసం ఎన్ని లక్షణాలచేత వ్యక్తమవుతూ ఉందో పేర్కొని, విశ్వంలోని జడత్వాన్ని పొందిన చైతన్యశక్తి భాగాన్ని పలు విధాలుగా ప్రదర్శిస్తూ ఆమె విశ్వరూపాన్ని చిత్రించాలని సంకల్పించారు. అంతేకాదు. ప్రతి రెండవ శ్లోకంలోనూ మన భారతదేశ దుస్థితిని దేవికి విన్నవిస్తూ, 24వ శ్లోకంలో దానిని ఎదుర్కొనే శక్తిని ఇమ్మని అర్థించి, వైదిక భారతదేశ అభ్యుదయంకోసం, అవైదిక తిమిర సంహారంకోసం ఆ వైదిక దేవతయైన ఇంద్రాణీదేవి స్తుతి ఫలాన్ని అర్థిస్తూ రచనకు ఉపక్రమించారు.
ఈ రచనాకాలంలోనే ఆయనకు విపరీతమైన తలనొప్పి రావడంతో రమణలకు ఆ విషయాన్ని విన్నవించారు. ఆ రాత్రి గణపతి మునికి కపాలబేధనం అనుభవంలోకి వచ్చింది. కపాలబేధనం అనుభవంలోకి రాకముందు, వచ్చాక తాను అనుభవించిన స్థితికి ఛందోబద్ధంగా శ్లోక రూపాన్నిచ్చారు నాయన. దానిని ఎనిమిదవసారి ఉమాసహస్రాన్ని సంస్కరించినప్పుడు అందులోకి జొప్పించారు. ఇంద్రాణీదేవి గ్రంథి భేదినీశక్తి. ఆమె అనుగ్రహంవల్ల రుద్ర గ్రంథి విబేధమై, శీర్షకపాలాలు భిన్నమవడాన్ని నాయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఆ యోగసిద్ధి వల్ల ఇంద్రాణీ విద్య అనే మహామంత్రఫలం సిద్ధించినట్టు నాయన భావించారు. అంతేకాదు.అనుభవంలో తన కుండలినీశక్తి ఎలా సహస్సు నుండి మహస్సుగా మారిందో (అంటే ఉపాధితో కూడిన తేజస్థితి నుండి విడిపోయి, దానిని ఆశ్రయించక సుషుమ్నా నాడిలో మేల్కొన్న జ్యోతిర్మయి స్థితిని పొందడం) నాయన అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. సుషుమ్న నాడిలో నిద్రించే కుండలినీ శక్తి మేల్కొని హృదయ గ్రంథిని భేదించుకుని అహానికి మూలమైన ఆత్మలో స్థిరత్వాన్ని పొందాల్సి ఉంది. అపుడే యోగి జీవన్ముక్తుడవుతాడు. అటువంటి స్వస్వరూప సిద్ధినే చివరి సిద్ధి అని అంటారు. రేణుక పేరున్న ఇంద్రాణీదేవి అటువంటి పరమార్థ సిద్ధిని నాయనకు అనుగ్రహించింది. ఆ తల్లినుద్దేశించి నాయన ఆరంభించిన రచన 700 శ్లోకాలతో అనుకున్న 21రోజుల వ్యవధిలో పూర్తి అయింది. నాయన ప్రతిజ్ఞానుసారం ఇంద్రాణీదేవి ఆ స్తుతికి ప్రసన్నురాలై రచనా కాలంలో ప్రతి సాయంకాలమూ విద్యుత్పరంపరల మెరుపులను ఆకాశంలో చూపించింది. రచన పూర్తిచేశాక నాయన తన భార్య,. శిష్యులతో పడైవీడులోని రేణుకా క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఇంద్రాణీ సప్తశతిని పఠించారు. సాక్షాత్తూ ఆ తల్లి విన్న రీతి అక్కడ ఉండిన వారందరికీ అనుభవంలోకి వచ్చింది.
ఇంద్రాణీ సప్తశతి ఎంత మహిమ కలిగిందో ఒక చిన్న సంఘటన మనకు తెలియజేస్తుంది. శిరసి సమీపంలోని కుళువే గ్రామంలో గణపతి ముని ఉండిన సమయంలో ఒక శ్రీమంతుని కొడుకు (గణేశభట్టు) నాయన మంత్రమూర్తి అని తెలిసి అతని భార్యకు ఏదో సోకి, బట్టలను విసర్జించి, మతిలేని రీతిలో ప్రవర్తించడం గురించి చెప్పారు. తన భార్యకు కలిగిన దుస్థితిని తొలగించి ఆమెకు స్వస్థత కలిగించి తమను కాపాడమని వేడుకున్నారు. నాయన ఒకసారి అలా తోటలోకి వెళ్లి తిరిగి వచ్చి ఆ శ్రీమంతుని భార్య ఉన్న గది వద్దకు వచ్చి ‘వస్త్రం ధరించి ఇటు రా!’ అని చెప్పారు. వెంటనే ఆమె బట్టలను ధరించి వచ్చి వినయంతో నాయనకు నమస్కరించి, ‘నాకు పునర్జన్మనిచ్చారు. మీ పాదాలెప్పుడూ నా చిత్తమందు ఉండేలా చూడండి’ అని ప్రార్థించి తన భర్తతో వెళ్లిపోయింది. ఆమె కొద్దిరోజులకు తిరిగి వచ్చి నాయనతో తన భర్తకు టైఫాయిడ్ వచ్చిందనీ అది తగ్గటం లేదనీ చెప్పినపుడు, నాయన తనవద్ద ఉండిన ఇంద్రాణీ సప్తశతి ప్రతిని ఆమెకు ఇచ్చి రోగి పక్కన కూర్చుని దానిని పారాయణ చేయమని చెప్పారు. ఒక్క పారాయణతో గణేశభట్టు జ్వరం మాయమైపోయింది.
ఇంద్రాణీ సప్తశతిలో కుండలినీ యోగ రహస్యాలూ లేకపోలేదు. కుండలినీ, కుకలకుండ, కులకుండాగ్ని, చిచ్ఛక్తి, చిదగ్నికుండ, బ్రహ్మగ్రంథి విబేధిని, సుషమ్మ నాడి, కపాల భేదన, సుషమ్న సంచారం వంటి ఎనె్నన్నో అంశాలను ఈ ఇంద్రాణీ సప్తశతిలో తెలియవస్తాయి. రమణ, గణపతుల మధ్య జరిగిన ఆ కుండలినీ ‘శక్తి ప్రవాహానే్న’ ఇంద్రాణీ సప్తశతిలో నాయన ప్రవేశపెట్టారు. తాను స్వయంగా అనుభవించిన శక్తి ప్రవాహాన్ని (కుండలినీ శక్తి) కూడా కొన్ని స్తబకాల్లో వ్యక్తంచేశారు. ఇవి యోగసాధకులకెంతో వినియోగిస్తుంది. అంతేకాదు, ఎన్నో జ్యోతిశ్శాస్త్ర, మంత్రశాస్త్ర, ఆయుర్వేద రహస్యాలనూ నాయన ఇంద్రాణీ సప్తశతిలో పొందుపరిచారు. అన్నీ నిత్య జీవితంలో మనకు పనికివచ్చే అంశాలే.
దేశంలోని అనిశ్చితి, అల్లకల్లోల పరిస్థితులు, అశాంతి, అరాజకాలనుంచి దేశాన్ని రక్షించమని ఆ అమ్మవారిని వేడిన శ్రీ వాశిష్ఠ గణపతిముని వ్రాసిన ఈ ఇంద్రాణీ సప్తశతి నేడు భారతదేశంలో నెలకొని ఉన్న అవినీతి, అరాచక పరిస్థితుల దృష్ట్యా భారతీయులందరూ పఠించాల్సిన అవసరం ఎంతో ఉంది. కేవలం మన భారతదేశంలో సుఖశాంతులు నెలకొనడానికే కాదు, మన ఇళ్లలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, ఎలాటి శత్రుబాధలు లేకుండా ఉండటానికి ఇంద్రాణీ సప్తశతి ఎంతో చక్కగా ఉపకరిస్తంది.

  • -- వి.వి.వేంకటరమణ సెల్. నెం. 9441234429 
  • 19/08/2012

    Source : 
http://archive.andhrabhoomi.net/content/indrani

1 comment:

  1. great posting...very intresting...kindly post about sadhakas, avaduthas life histories...
    am very very intrested........thankyou...god bless you.....

    --
    sathish kumar

    ReplyDelete