Pages

Tuesday 7 May 2013

తెలుగువారు - మంత్రసిద్ధితో వెలుగు వారు --ప్రఖ్య మధు బాబు

మంత్ర సిద్ధులుగా, మహా యోగులుగా ఖ్యాతి గాంచిన మహాత్ములు ఎందరో ! అందులో ప్రసిద్ధులైన తెలుగువారు సాధించిన విజయాలు మనకి ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగచేస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీ త్రిలింగ స్వామి వారు కాశీలో వుండేవారు. రామకృష్ణ పరమహంస నుంచి మొదలుకొని ఎందరో మహానుభావుల మన్ననలను పొందిన శ్రీ త్రిలింగ స్వామి వారు ఒక అవధూతగా, అఘోరిగా, సాక్షత్ శివరూపులుగా ఎందరికో తెలుసు. వారు మూడు వందల సంవత్సరాలుగా పైగా కాశీలో జీవించినట్లు ప్రతీతి. జగత్సర్వం భవన్మయంగా దర్శించిన ఈ మహాత్ములు తెలుగువారు. ఆంధ్రప్రదేశ్ 'త్రిలింగ దేశం 'గా ఖ్యాతిగాంచినందున వారిని కాశీలో 'త్రిలింగ స్వామి ' గా పిలిచేవారు.

రమణ మహర్షుల వారు చాలా సంవత్సరాలపాటు మౌని గా వుండేవారు. ఒక రోజు మన తెలుగు వారు, మహా పండితులు, తపస్వులూ అయిన శ్రీ కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని రమణ మహర్షిని దర్శించారు. గణపతి మునిని చూడగానే రమణ మహర్షి తన మౌనాన్ని వీడి "నాయనా!" అని పిలిచారు. అప్పటినించి గణపతి ముని 'నాయన ' గా ప్రసిద్ధులయ్యారు. రమణ మహర్షికి శిష్యులయ్యారు. అంతవరకు మౌన స్వామిగా పేరుగన్న ఆయనకు 'రమణ మహర్షి ' అన్న నామధేయాన్ని ఇచ్చింది కూడా ఈ నాయనే!

త్రిలింగ స్వామిని గురించో, నాయన గారి గురించో నాలుగు వాక్యాలలో రాయడం చాల కష్టం. ఉపాసనా బలంతో, సాధనా సిద్ధితో మానవ ఆలోచనా పరిధులని మించిన లీలలని దర్శింపచేసిన మహాత్ములు వీరు. త్రిలింగ స్వామి ఒక్కొక్కసారి దిగంబరులుగా వుండటంచేత కాశీలో రక్షకభటులు వారిని లోపలవుంచి తాళంవేసేవారుట. అలా చేసిన కొద్ది నిమిషాలకే త్రిలింగ స్వామివారు మళ్ళీ వీధిలో కనిపించేవారు. వేసిన తాళం వేసినట్టే వుండేది. ఇక నాయన గారిని గురించి ఎన్నో విశేషాలు దర్శించిన వారున్నారు. వారు వ్రాసిన 'ఉమా సహస్రం ' ఇప్పడికీ లభిస్తోంది. నాయన గారు ఉమా సహస్రాన్ని అమ్మవారికోసం అర్పిస్తూ చెప్పారు, "అమ్మా ఈ గ్రంధంలో ఏ పద్యం నచ్చకపోయినా చెప్పు ఆ భాగాన్ని అగ్నికి ఆహుతిస్తాను " అన్నారుట. నాయన గారు ఉమా సహస్రం చదవడం ప్రారంభించేసరికి ప్రతి పుటకి ఒక మెరుపు చొప్పున ఆకాశంలో మేఘాలు లేకుండా మెరుపులతో దేవి అనుగ్రహించడం జరిగింది.

మంత్ర శాస్త్రంలో దేవీ మంత్రములలో అత్యంత శక్తివంతమైనవి పది విద్యలున్నాయి. వాటినే దశ మహావిద్యలంటారు. అందులో కమల, కాళి, తార, ఛిన్నమస్త, ఇలా విశేష శక్తులున్నాయి. వీటిలో తారను (తారే తుతారే తొరే స్వాహా - ఇది పాళి భాషలో తారా మంత్రం. ఈ తారనే మనం నీల-సరస్వతి అంటాం. ఈమె ఆల్ట్రా వయోలెట్ కాంతిలాంటిది. అతీతము, అతిగోప్యము అయిన సృష్టి శక్తులనిస్తుంది. ఈమె వసిష్టుని భార్య తార కాని, రామాయణంలో తార కాని కాదు. ఈ దేవత తరింపచేయునది కనుక తార అయింది), ఛిన్నమస్తను (వజ్రయోగినిగా ) బౌద్ధులు కూడా ఉపాసిస్తారు. ఛిన్నమస్త ప్రచండ చండిగా, ఇంద్ర శక్తిగా ప్రసిద్ధి చెందింది. ఆ దివ్య శక్తి అనుగ్రహంతో సహస్రారాన్ని దాటే స్థితికి (కపాలభేదం) చేరి ఆ అనుభవాలని అందచేసారు నాయన. డేవిడ్ ఫ్రాలీ (వామదేవ శాస్త్రి) వంటి పాశ్చాత్యులు కూడా నాయన మార్గాన్ని అనుసరిస్తున్నారు, అనేక నూతన మంత్ర విశేషాలని అందిస్తున్నారు.

'రాయస్కామో వజ్రహస్తం సుదక్షిణం పుత్రేన పితరమ్హువే ' అనే వేద మంత్రం ఇంద్ర శక్తి మంత్రం అని నాయన గుర్తించి దాని ఉపాసనా శక్తిని ఎలా వినియోగించాలో తెలియజేసారు. అస్థిసంధాన మంత్రం ద్వారా విరిగినచేతి ఎముకను అతికింపచేసి మంత్ర శక్తిని ఒకసారి ప్రకటింపచేసారు.

ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎందరో మహాత్ములు జ్ఞాపకం వస్తారు. మాష్టర్ ఏ.కే గారు, విశాఖపట్నం జిల్లాలో వున్న పాకలపాటి గురువుగారు, నెల్లూరిలో వున్న వెంకయ్య స్వామి, జిల్లెళ్ళమూడి అమ్మ గారు, ఒంగోలు ఎక్కిరాల భరధ్వాజ గారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విన్నూత్న పంధాలో పయనించి దేవతానుగ్రహానికి కొత్త మార్గాలని చూపించారు. వేదాలు అర్ధంకాని, ఉపనిషత్ సారాంశం తెలియని, పురాణరహస్యాలు అన్వేషించని మనలాంటి మామూలు వారుసైతం ప్రపంచాగ్నికి సమిధలు వెయ్యొచ్చు అని వీరంతా ఘంటాపధంగా చెప్పారు.

మరి తెలుగులో కూడా మంత్రాలుంటే అవి ఎలా వుంటాయి? బీజాక్షరాలు లేకుండా కేవలం భావంతో వుండే ఇవి ఎలా పనిచేస్తాయి? మంత్రానికి, భాషకి, భావానికి సంబంధం ఏమిటి? మంత్రానికి నిజంగా ఇంత శక్తి వుంటే హోమం, యంత్రం, తంత్రం అంటారు అవి ఏంచేస్తాయి? నేను నిజాయితిగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ బతుకుతున్నాను - నాకివన్ని తెలియపొతే నష్టం ఏంటి? ఒక వేళ నన్ను నేను హాయిగా వుంచుకోవాలంటే చిన్న మంత్రం (మడి - ఆచారం లేకుండా) ఏదైన వుందా?

ఆధారం : 

2 comments:

  1. NAYANA GARI AVADHANA PRTIBHA NI KUDA AVARINA OKA VYASAM RASTE BAGUTNDI

    ReplyDelete
  2. NAYANA GARI AVADHANA PRTIBHA NI KUDA AVARINA OKA VYASAM RASTE BAGUTNDI

    ReplyDelete