Pages

Tuesday 7 May 2013

నవయుగ యోగ చక్రవర్తి - జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ


భ గవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస దక్షిణేశ్వరంలో శ్రీ కాళిమాత అర్చనారతులై బాహ్య జగద్వవహారాల కతీతంగా మూల విరాట్టులా ఉండేవారు. వారి శిష్యులైన స్వామి వివేకానందులు ఉత్సవ మూర్తిలా విశ్వవిహారం చేసి తమ గురుదేవుల సందేశాన్ని ప్రపంచానికి అందేచేశారు.
అట్లే తిరువణ్ణామలై లోని అరుణాచల గుహలలో అజ్ఞాతంగా తపస్సాధనామగ్నులై వౌనస్వామిగా పిలువబడుతూ ఉండిన మహాతపస్వి వెంకట రామన్‌గారి ఆధ్యాత్మిక సిద్ధులను అర్థం చేర్చుకొని వారిని రమణ మహర్షిగా లోకానికి పరిచయం చేసిన అయ్యల సోమయాజుల వాసిష్ఠ గణపతి ముని.
వివేకానందులవలె గణపతిమునిగా మహుముఖ ప్రజానిధి. వేదశాస్త్ర కావ్యాలంకార ప్రవీణులు, ఆశుకవితా చతురులు, అష్టావధాన విద్యావారధులు, జ్యోతిషశాస్త్ర విశారదులు. దేశభక్తి ప్రపూర్ణులైన త్యాగధనులై భగవాన్ రమణులచే ‘నాయనా’ అని పిలువబడిన మహామనీషి కావ్యకంఠ వాసిష్ఠ గణపతిముని.

‘కావ్యకంఠ’ బిరుదాంకితులైన గణపతిశాస్ర్తీ 1878నవంబరు 17వతేదీన విశాఖ పట్నం జిల్లా కలవరాయి గ్రామంలో జన్మించారు. నరసమాంబ, నరసింహశాస్ర్తీగార్లు వారి జననీ జనకులు.
నరసింహశాస్ర్తీగారు సర్వశాస్త్ర విశారదులు, భారతదేశ ప్రాచీన వైభవాన్ని వైదిక ధర్మాన్ని పునరుద్ధరింపగల సంతానాన్ని కాంక్షించేవారు వారి అభీష్ఠం మేరకు దైవాంశసంభూతులుగా అవతరించినవారు గణపతిముని.
పదేళ్ల ప్రాయంలోనే కావ్య, గణిత ఖగోళ, జ్యోతిష వాస్త్రాల్లో అసాధారణమైన పాండిత్యం గడించి తమ విద్యాగురువులైన ప్రకాశ శాస్ర్తీ గారిని ఆశ్చర్యచకితుల్ని చేశారు. పంచాంగ గణనంలోవిన్నూత పథకాన్నిరూపొందించారు.
12ఏట విశాలాక్షి అనే ఆమె వారి సహధర్మచారిణి అయ్యారు. పదహారేళ్ల వయస్సులో మహాజ్జ్వాల ఆశుకవితా విశారుదులయ్యారు. తండ్రి చే మహా మంత్రోపదేశం పొంది తపస్సాధనను నాసిక్, భువనేశ్వర్‌లలో చేసి తపస్సిద్ధి సంపన్నులై స్వగ్రామం చేరుకున్నారు. భార్య విశాలక్ష్మమ్మ కోరిక మేరకు సంస్కృతపండిత ఉద్యోగానికి ప్రయత్నించారు. దానికి కావలసిన ధ్రువ పత్రాలు వారి వద్దలేవు. కావ్యకంఠులై, కవిసార్వభౌములై అప్పటికే సువిఖ్యాతులైన గణపతి మునికి ఆనాడు ‘బడిపంతులు’ ఉద్యోగానికి కావలసిన దృవపత్రాలులేవు!
20 ఏళ్లు నిండునాటికే సర్వశాస్త్ర పారంగతులైన మహా కవితాశక్తి సంపన్నులైన గణపతిశాస్ర్తీ గారు విజిగీషులై నవద్వీప విద్వత్పరీక్షల్లో పాల్గొనుటకై ఉత్తరదేశము వెళ్లారు. మహాపండితునిగా ప్రసిద్ధుడైన అంబికాదత్తుడు ఆ సంవత్సర పరీక్షలకు అధ్యక్షులు గణపతి ముని పండిత సభలో ప్రవేశించి అధ్యక్షులను పరిచయం చేసుకొని ‘్భవాన్ దత్తః, అహంత్వౌరసః’ (మీరు అంబికకు దత్తపుత్రులు, నేను ఔరసుడను) అన్నారు. గణపతిముని మహత్తర కవిత్వ పటుత్వాన్ని ప్రశంసిస్తూ విద్వత్సభలో 1900 జూన్ 20వ తేదిన ‘కావ్యకంఠ’ అనే బిరుదునిచ్చిసత్కరించారు అంబికా దత్త పండితులు.
1903 లో మద్రాసు నారాయణ సుదర్శనులచే పండితులను జయించి ఆరునిమిషాల్లో ఇరవై ఐదు శ్లోకాలను రచించి స్వర్ణకంకణ బహుమతి నందుకొన్నారు
అరుణాచల క్షేత్రం చేరి ‘హరి సహస్రం’ అన్న పేరుతో వేయి శ్లోకాలను రచించి కృత్తికోత్సవ సందర్భంగా స్వామి సన్నిధిని సమర్పించారు. అక్కడే అధ్యాపకులుగా ఒక సంవత్సరం కాలం గడిపి వేలూరులో నాలుగేళ్లు తెలుగు పండితులుగా పనిచేశారు. విద్యార్థులల్లో మాతృదేశాభిమానంతోపాటు వేద మతాభిమానం కూడా పెరగాలన్న దీక్షతో పలుచోట్ల ఉపన్యసించారు.
ఒకనాడు థామస్ హారిస్ అనే ప్రధానోపాధ్యాయుడు ప్రసంగవశాన ‘సంసారం వదులుకొని నిజంగా తపస్సు చేసేవాళ్లు ఇపుడెవరున్నారు? ’ అని ప్రశ్నించారు. వెంటనే గణపతి గారు తమ పదవికి రాజీనామ ఇచ్చి 1907 నవంబరు 3 న తపస్సు చేయడానికి తిరువణ్ణామలై తిరిగి వ చ్చారు.
ఇలా తపస్సు చేసుకొంటున్న గణపతి మునికి ఒకసారి బ్రాహ్మణ స్వామి తపస్సు అంరార్థాన్ని తెలిపారు. ‘నేను’ అనేస్ఫురణ ఎక్కడ నుంచివస్తుందో అక్కడ విచారిస్తే మనస్సు అక్కడ లీనమవుతుంది. అదే తపస్సు. బహిర్ముఖమైన మనసును నియంత్రించి అంతర్ముఖం కావించడం కఠినమైన సాధన. ఆ సాధనమే తపస్సు అని ప్రవచించారు. భగవంతుడే రమణ మహర్షిగా అవతరించాడని గణపతిముని అనుకొన్నారు. ‘శ్రీరమణ పంచకం’ అనే శీర్షికతో ఐదు శ్లోకాలను రచించి స్వామి సన్నిధిలో చదివారు. ఆ శ్లోక రత్నమాలికను గురుదక్షిణగా గణపతిముని రమణ మహర్షులకు సమర్పించగా స్వామి ‘సరే నాయనా’ అని స్వీకరించారు.
రమణుల గురించి ఇదివరకే ‘హరసహస్రం’ రచించిన గణపతి ముని తనకొక గురువును చూపి తపస్సు చేయుటకు ప్రోత్సహించిన జగన్మాత ఉపాదేవిని స్తుతిస్తూ ‘ఉమాసహస్రం’ అనే గ్రంథాన్నిరచించారు.
‘ఉమాసహస్రం’ పఠించేటపుడుఅనేక అద్భుత సంఘటనలు జరిగేవి. సముజ్వల కాంతితో ఒక నక్షత్రం కనిపించేది. రమణ భగవాన్ కార్తికేయ అవతారమని గణపతి అనేవారు.
గణపతి ముని ‘ఇంద్రాణి సప్తశతి’ ని రచించారు అందులో స్ర్తిల స్వాతంత్య్రాన్ని రక్షించుటకు పంచమ జాతుల అపార దైన్యాన్ని తొలగించుటకు ధర్మం పేరున సాగుతున్న అధర్మాన్ని పరిహరించుటకు గంభీరమైన వేదార్థంలో సందేహాలు తీర్చుట కొరకు ఘోరమైన వర్ణ భేదాన్ని తొలగించుటకు అమ్మా నా బుద్ధి శక్తికి మనోల్లాసాన్ని ప్రసాదించు’ అని ప్రార్థించారు.
గణపతిముని అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు హాజరై అక్కడ స్ర్తిల హక్కులను గురించిన సభలో పురుషులతో సమానంగా స్ర్తిలకు ఉపనయనం, హోమం, శ్రాద్ధం మొదలగు వాటిని నిర్వహించుటకు హక్కు ఉందని శాస్త్రప్రమాణాలతో నిరూపించారు. అస్పృశ్యతా నివారణ శాస్త్ర సమ్మతమని సంస్కృతములో ఉపన్యసించారు.
గణపతి రచించిన లాలిభాషోపదేశ అను గ్రంథంలో సంస్కృతము ప్రపంచ భాష కావాలని అభిలషించారు. గణపతిముని 1928 ఆగస్టు 15న అరవిందాశ్రమం చేరారు. రెండు నిమిషాలపాటు పరస్పరం చూసుకొన్నారు. గణపతిముని గజాననాంశ సంభవుడని అరవిందులు భావించారు. అరవిందులు అద్భుత శక్తి తేజం కలవారని గణపతిముని భావించారు. ఒక నెలరోజులు పాండిచ్చేరిలో ఉండి 108 శ్లోకాలు గల ‘తత్వ శాసనం’ అనే గ్రంథాన్ని రచించారు. తిరువణ్ణామలైతిరిగి వచ్చి ఇంద్ర సహస్రనామ స్తోత్రం రచించారు. కపాల భేదన సిద్ధిని సాధించిన మహర్షి గణపతి ‘్భరత విమర్శనం’ అనే మహత్తర గ్రంథాన్ని రచించారు. చివరకు 1936 ఏప్రిల్ 23న గణపతిముని అఖండ బ్రహ్మండంలో కలిశారు.
ఫోటో... శ్రీ కావ్యకంఠ గణపతి ముని

No comments:

Post a Comment