Pages

Tuesday 7 May 2013

ఆది, అంతమూ నీవే! ఆదిపరాశక్తివి నీవే!

మనం బార్హతం శతకమంలోని మూడవదైన మణిమధ్యా స్తబకంలోని మరికొన్ని శ్లోకాలను చదువుదాం.
12. ఉద్గత కీలం మూలమిదం భిన్న కపాలం శీర్షమిదం
ఉజితమోహం చిత్తమిదం వాసన శక్తిర్మాం విశతు॥

13. దృశ్య విరక్తం చక్షురిదం భోగవిరక్తం కాయమిదం
ధ్యేయ విరక్తా బుద్ధిరియం వాసవశక్తి ర్మాం విశతు॥
14. చక్షు రదృశ్య జ్వాలభృతా వ్యాపక ఖేన ప్రోల్లసతా
విస్తృత కాయం సందధతీ వాసవశక్తి ర్మాం విశతు॥
15. కాయ మజస్రం వజ్ర దృఢం బుద్ధి మశేషం వ్యాప్తిమతీ
దివ్యతరంగైరా దధతీ వాసవశక్తి ర్మాం విశతు॥
16. మూర్ధ్ని వతంతీ వ్యోమతలా త్సంతతమంత స్సర్వతనౌ
సంప్రవహంతీ దివ్యఝరై వాసవశక్తి ర్మాం విశతు॥
17. భానువిభాయాం భాసకతా దివ్యసుధాయాం మోదకతా
కాపి సురాయాం మాదకతా వాసవశక్తిర్మాం విశతు॥
కిరణాలు వెళ్లే మూలాధారం, కపాల భిన్నమైన శిరస్సు, మోహాన్ని వదిలేసిన మనస్సు కలిగిన నా ఈ దేహంలో ఆ వాసవ శక్తి ప్రవేశించుగాక (కపాల భేదన జరిగాకనే గణపతిముని ఈ ఇంద్రాణీ సప్తశతి వ్రాశారనేది మనకు తెలిసిందే)! విరక్తితో ప్రపంచంపై నుండి దృష్టి మరల్చిన ఈ కన్ను, భోజాలనుంచి విరక్తమైన ఈ దేహం, ధ్యేయ వస్తువునుండి విరక్తమైన బుద్ధి కలిగిన నన్ను (నాలో) ఇంద్రాణీదేవి ప్రవేశించుగాక!
అంతేకాదు. కంటికి కనిపించని జ్వాలలను భరిస్తూ ఎంతో ఎక్కువగా ప్రకాశవంతంగా ఉంటూ విస్తరించిన ఆకాశానే్న శరీరంగా కలిగిన ఆ ఇంద్రాణీదేవి నన్ను ప్రవేశించుగాక! సంపూర్ణమైన బుద్ధిని వ్యాపింపజేస్తూ, ఎల్లవేళలా శరీరాన్ని వజ్రంలాగా దృఢంగా ఉంచే ఆ ఇంద్రాణీదేవి నన్ను ప్రవేశించుగాక! ఆకాశంనుంచి శిరస్సుపై పడ్తూ శరీరమంతా వ్యాపించి నిరంతరమైన దివ్య ప్రవాహంగా ఉండే ఆ ఇంద్రాణి నాలో ప్రవేశించుగాక!
సూర్యుడిలోని ప్రకాశతత్వమూ, అమృతంలోని ఉల్లాసం, సురలోని మాదకతా- ఈ మూడు వాస్తవ శక్తిలోనే ఉన్నాయి. ఆ వాసవశక్తి నాలో ప్రవేశించుగాక!
18. భాసయతానే్మ సమ్యగృతం మోదముదారం పుష్యతుమే
సాధుమదం మే వర్ధయతా న్నిర్జర భర్తుశ్శక్తిరజా॥
ఇంద్రాణీ శక్తి నా మానసిక సత్యాన్ని బాగా ప్రకాశింపజేయుగాక. నాకు బాగా సంతోషాన్నిస్తూ సాత్విక బలాన్ని కూడా ఇచ్చుగాక!
19. కశ్చన శక్తిం యోగబలా దాత్మశరీరే వర్ధయతి
ఏపి వివృద్ధిం భక్తిమతః కస్య చిదీశే త్వం వపుషి॥
20. సాధయతాంవా యోగవిదాం కీర్తయతాంవా భక్తిమతాం
వత్సల భావాదింద్రవధూ ర్గద్భభువాంవా యతివశం॥
అమ్మా! ఇంద్రాణీ! యోగబలంతో ఒకడు తన దేహశక్తిని పెంపొందించుకుంటే, ఇంకొకరి శరీరంలో నీవే వృద్ధినొందుతూ ఉంటావు. సాధన చేసి యోగవేత్తలకూ, కీర్తించే భక్తులకూ కూడా వాత్సల్యంతో తన గర్భంనుంచి వెలువడిన వారికి వశమైనట్లే ఆ ఇంద్రాణీదేవి వశమవుతుంది.
21. యస్య సమాధిఃకోపి భవే దాత్మమనీషా తస్యబలం
యస్తవ పాదాంభోజరత స్తవ్యఖలు త్వం దేవి బలం॥
22. ద్వాదశవర్షీ యోగబలా ద్యాఖలు శక్తిర్యుక్త మతేః
తాం శచి దాతుం భక్తిమతే కాపి ఘటే తే మాతరలం॥
అమ్మా! ఇంద్రాణీదేవీ! 12 సంవత్సరాలు యోగబలనియుక్తుడై ఉండినవానికి ఏ శక్తి అయితే కలిగిందో, నీ భక్తుడనైన నాకు అటువంటి శక్తినే ఇవ్వాలీ అని నీవనుకుంటే ఒక్క గడ్యి చాలు. నాకు తప్పక ఇవ్వగలవు.
23. యోగబలాద్వా ధ్యానకృతో భక్తిబలాద్వా కీర్తయత.
యాతు వివృద్ధిం విశ్వహితా వాస్తవశక్తిర్మే వపుషి॥
యోగబలంతో ధ్యానించే వారికీ, భక్తిబలంతో కీర్తించే వారికీ ఏ శక్తి అయితే వృద్ధి చెందుతుందో, అలాటి ఇంద్రాణీ సంబంధమైన శక్తిని నా శరీరం కూడా పొందుగాక!
24. దుఃఖిత మేత చ్ఛ్రీరహితం భారతఖండం సర్వహితం
త్రాతుమధీశా స్వర్జగత స్సుక్షమబుద్ధిం మాం కురుతాం॥
ఐశ్వర్యాన్ని కోల్పోయి సదా దుఖిఃస్తూన్న సర్వహితమైన ఈ భారత ఖండాన్ని రక్షించడానికి ఇంద్రాణీదేవి నాకు తగిన బుద్ధిని ఇచ్చుగాక!
25. సంతు కవీనాం భర్తురిమే సుందర బంధా శ్శుద్ధతమాః
సన్మణి మధ్యా స్వర్జగతో రాజ మహిష్యాః కరణ సుఖాః॥
కవి భర్తయైన ఈ గణపతిముని వ్రాసిన సుందరమైన, అత్యంత శుభ్రమైన ఈ స్మరణిమధ్యా వృత్తాలు ఇంద్రాణీదేవి చెవికి సుఖాన్నిచ్చుగాక!
బార్హతం శతకంలోని మూడవదైన మణిమధ్యా స్తబకం ఇక్కడికో పూర్తి అయింది.
ఇపుడు
మూడవదైన బార్హతం శతకమంలోని మాత్రాసమక స్తబకములోని కొన్ని శ్లోకాలను తెలుసుకుంది.
1. శుక్ల జ్యోతిః ప్రకర్తర్వ్యాప్త స్సూక్ష్మోప్యంతాన్ హరితాం హాసః
జిష్ణోః పత్న్యా స్తిమిరా రాతి ర్ని శే్శషం మే హరతా న్మోహం॥
కంటికి కనిపించని తెల్లని కాంతితో నలుదిక్కులా వ్యాపించినదీ, చీకటిని పారద్రోలేదీ అయిన ఇంద్రాణీదేవి చిరునవ్వు నా అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించుగాక!
శృణ్వత్కర్ణా సదయాలోకా లోకేంద్రస్య ప్రియనారీ సా
నిత్యాక్రోశై ర్విరుదద్వాణీం పాయాదేతాం భరత క్షోణీం॥
నేను చేసే ఈ స్తుతిని తన చెవులారా వినే ఆ ఇంద్రాణీదేవి అపార దయ కలిగిన తల్లి. నిత్య శోకంతో చాలా రోదిస్తూ ఉండే వాక్కు కలిగిన ఈ భారతభూమిని ఇంద్రాణిదేవీ రక్షించుగాక!
3. దేవేషు స్వః పరిదీప్యంతీ భూతేష్విందౌ పరిఖేలంతీ
శక్తిరిష్ణో ర్ద్విపదాం సంఘే హంతై తస్యాం భువి నిద్రాతి॥
స్వర్గంలో దేవతలలో ప్రకాశిస్తూ, చంద్రగోళంలో భూతాలలో క్రీడించే ఇంద్రాణీదేవి ఈ భూమిపై ఉండే మానవులలో మాత్రం నిద్రిస్తూ ఉంది. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. (అజ్ఞానులలో మూలాధార చక్రంలో నిద్రిస్తూ ఉంటుందని అంటారు) కదా!
4. నిద్రాణాయా అపి తేజ్యోతి ర్గంధాదేతే ధరణీలోకే
మర్త్యః కించిత్ప్ర భవంతీ శే త్వం బుద్ధాచే త్కిము వక్తవ్యం॥
తల్లీ! నిద్రిస్తూ ఉన్నా నీ తేజస్సు అనే గంధంవల్ల భూలోకంలో ఈ మనుష్యులు కొంతవరకూ సమర్థలుగానే ఉన్నారు. కానీ, నీవు ఆ మనిషిలో మేల్కొన్నావని తెలిస్తే ఇక చెప్పడానికేముంటుందీ?
5. మేఘచ్ఛన్నో ప్యరుణ స్తేజో దద్యాదేవ ప్రమదే జిష్ణోః
అత్ర స్థానా భవతీ గ్రంధీ చ్ఛన్నా ప్యేవం కురుతే ప్రజ్ఞాం॥
అమ్మా! సూర్యుడు మేఘాలతో కప్పబడినా వెలుతురునిస్తాడు. నీవు గ్రంధులతో కప్పబడినా, భూలోకవాసులకు వారికి ప్రజ్ఞనిస్తూ ఉన్నావు.
6. ధ్యాయామో యత్క్థయామో య త్పశ్యామో యచ్ఛృణుమో యచ్చ!
జీవోమోవా తదిదం సర్వం నిద్రాణాయా అపితే భాసా!!
నీవు నిద్రిస్తూ ఉన్నా సరే, నీ కాంతివల్లనే మేము ధ్యానం చేయడం, పలకడం, చూడటం, వినడం, జీవించడం - ఇవన్నీ చేస్తూనే ఉన్నాం.
7. నాడీ బంధా దభిమానాచ్చ చ్ఛన్నా మాత ర్భవతీ దేహే:
ఏకాపాయా దితరో నశే్య త్తస్మా ద్ద్వేధా తపసః పంథాః॥
అమ్మా! నాడీబంధం వల్లా, అభిమానం వల్లాకూడా నీవు దేహంలో కప్పబడి ఉన్నావు (అందుకే వాటిని గ్రంధులున్నారు). ఏ ఒక దానికి అపాయం కలిగినా రెండు నశిస్తాయి. అందువల్ల తపస్సుకు రెండు దారులు ఏర్పడ్డాయి. (ప్రాణ సంబంధమైనది ఒకటైతే మనస్సుకు సంబంధమైనదింకొకటి).
8. చిత్తం యస్య స్వజని స్థానే ప్రజ్ఞా బాహ్యా సభ వేద్యస్య
ఆధత్సే త్వం భువనాధీశే బుద్ధా క్రీడాం హృదయే తస్య॥
అమ్మా, ఎవరికి చిత్తం స్వస్థానంలో ఉంటుందో, ఎవరి ప్రజ్ఞ బయటకు తెలియదో అటువంటి వారి హృదయంలో తెలివివై నీవే ఉన్నావు (ఇక్కడ, ‘మనస్సును తన మూలమైన హృదయంలోనే అణిచి ఉంచి, ఆలోచనకు అందకుండా పోవడం’ అనే రమణ మహర్షి ఉపదేశంలో ఒక భాగం వెల్లడి అవుతుంది).

No comments:

Post a Comment